: ఆరుగురు సీఐలపై సస్పెన్షన్ వేటు?... ‘కాల్’ నాగులకు సహకారమే కారణం!
కాల్ మనీ వ్యవహారంలో రాజకీయ ఒత్తిడుల కారణంగా విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ సెలవుపై వెళుతున్నారన్న వార్తలు నిన్న కలకలం రేపాయి. అయితే, కేసు తీవ్రత దృష్ట్యా తన సెలవును రద్దు చేసుకుంటున్నట్లు సవాంగ్ కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. ఈ మేరకు రెండు నెలల క్రితం పెట్టిన తన సెలవును రద్దు చేయాలని డీజీపీకి లేఖ రాశానని కూడా ఆయన పేర్కొన్నారు. సెలవును రద్దు చేసుకున్న మరుక్షణమే సవాంగ్ ఈ కేసులో కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. కాల్ మనీ వ్యాపారులకు సహకరించడంతో పాటు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించని కారణంగా ఆరుగురు సీఐలపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఆయన రంగం సిద్ధం చేశారు. మరికాసేపట్లో ఈ ఉత్తర్వులు జారీ కానున్నాయన్న వార్తలు ఏపీ పోలీసు శాఖలో కలకలం రేపుతున్నాయి.