: మురుగు కాల్వలో ప్రామిసరి నోట్లు!... తప్పించుకునేందుకు ‘కాల్’నాగుల యత్నాలు
విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ వ్యవహారం వడ్డీ వ్యాపారులను ఆత్మరక్షణలో పడేసింది. ఆత్మరక్షణలో పడేసిందనే దానికంటే అరెస్టుల భయంతో వారిని ఉరుకులు పరుగులు పెట్టిస్తోందని చెబితే కరెక్ట్ గా ఉంటుందేమో. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పోలీసుల దాడులకు జడిసి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వడ్డీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక ఉన్న పళంగా ఇళ్లను వదిలి పారిపోలేని వడ్డీ వ్యాపారుల పరిస్థితి మరింత చిత్రంగా మారింది. పోలీసులు దాడులు చేసినా, పట్టుబడకుండా ఉండేందుకు వడ్డీ వ్యాపారులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. బాధితుల నుంచి రాయించుకున్న ప్రామిసరి నోట్లను దాచేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిధిలోని పైడిపర్రులో ఓ వడ్డీ వ్యాపారి తన వద్ద ఉన్న ప్రామిసరి నోట్ల కట్టలను మురుగు కాల్వలో పడేశాడు. దాంతో ఇక నిర్భయంగా ఉండొచ్చులే అనుకున్న అతడి యత్నం ఫలించలేదు. అప్పటికే గ్రామంలోకి ప్రవేశించిన పోలీసులకు కాల్వలో దస్తావేజుల కట్టలు కనిపించాయి. దీంతో వెనువెంటనే వాటిని నీటిలో నుంచి తీసిన పోలీసులు అవి ఏ ఏ వ్యాపారికి చెందినవన్న కోణంలో పరిశీలన చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సదరు వ్యాపారి క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యాడు.