: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి కుటుంబంలో స్థల వివాదం


ప్రముఖ సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తి కుటుంబంలో ఆస్తి తగాదాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఐ మ్యాక్స్ వెనుక 2420 గజాల స్థలాన్ని గతంలో ఆయనకు ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలం విషయంలోనే కొత్తగా వివాదం ఏర్పడింది. చక్రవర్తికి ముగ్గురు కుమారులున్నారు. వారిలో పెద్ద కుమారుడు శ్రీనివాస చక్రవర్తి కొన్ని నెలల కిందట చనిపోయారు. రెండో కుమారుడు కేఆర్ కే ప్రసాద్ కూడా ఈ యేడాదే ఏప్రిల్ 18న మరణించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇంట్లో పెద్ద కోడలు అరుణ, రెండో కోడలు నీరజ, చిన్నకుమారుడు రాజేశ్ చక్రవర్తి ఉంటున్నారు. అయితే పైన పేర్కొన్న స్థలాన్ని కాజేసేందుకు తోటికోడలు అరుణ, మరిది రాజేశ్ తనను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నారంటూ రెండో కోడలు నీరజ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ దస్తావేజులు తయారు చేసి అమ్ముకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఈ మేరకు చీటింగ్, ఫోర్జరీ సెక్షన్ ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయంలో దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News