: నెల్లూరులో లేడీ ‘కాల్’ నాగులు!... అవయవాలు అమ్ముకుని అప్పు తీర్చాలని బెదిరింపులు
విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ తరహా దందా ఏపీ వ్యాప్తంగా సాగుతోంది. నెలకు వడ్డీ లెక్కింపు అనేది సాధారణం. అయితే పది రోజులకు, వారానికి ఓసారి వడ్డీ లెక్కలేస్తున్న కాల్ మనీ వ్యాపారులు జనాన్ని కాల్చుకుతింటున్నారు. అప్పు తీసుకున్న వారి కుటుంబాలను కాటేస్తున్నారు. తాజాగా నెల్లూరు నగరంలో జరుగుతున్న కాల్ మనీ వ్యవహారంపై జనం ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు. ప్రధానంగా మహిళలతోనే రంగ ప్రవేశం చేస్తున్న కాల్ మనీ వ్యవహారంలో ఆ తర్వాత సదరు మహిళల అన్నలు, భర్తలు రంగంలోకి దిగుతున్నారు. అప్పు తీర్చేందుకు ఒళ్లు అమ్ముకోండి, అప్పటికీ సరిపడ డబ్బు దొరక్కపోతే, ఒంటిలోని అవయవాలను అయినా అమ్ముకోండి అంటూ ఫోన్లలో బెదిరిస్తున్న కాల్ మనీ లేడీలు బాధితులను నానా ఇబ్బందుల పాల్జేస్తున్నారు. దీనిపై ఇప్పటికే నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కాల్ మనీ లేడీలతో పాటు వారి భర్తలు, అన్నలూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.