: ఏటీఎంలను లూటీ చేస్తున్న మహారాష్ట్ర గ్యాంగ్ పై ఎస్సై కాల్పులు... తప్పించుకుని పరారైన దొంగల ముఠా


ఏటీఎంలలోని డబ్బును కొల్లగొట్టడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన మహారాష్ట్ర దొంగల ముఠా తెలంగాణలోని నిజామాబాదు, మెదక్ జిల్లాల్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని ఏటీఎంలను దోచుకున్న ఆ ముఠా, రూ.43 లక్షలు కాజేసింది. ప్రధానంగా నిజామాబాదు జిల్లా కోటగిరి, వర్ని మండలాల్లోని పలు ఏటీఎంలను ఆ ముఠా ధ్వంసం చేసింది. ఈ దోపిడీలకు సంబంధించి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఆయా చోరీలకు సంబంధించి రికార్డైన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి మెదక్ జిల్లాలోని ఓ ఏటీఎంపై దొంగలు దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ ప్రమాదవశాత్తు ఏటీఎంలో మంటలు చెలరేగాయి. దీంతో దొంగలు అక్కడి నుంచి ఉడాయించారు. దీనిపై సమాచారం అందుకున్న నిజామాబాదు జిల్లా లింగంపేట ఎస్సై రాకేశ్ రంగంలోకి దిగారు. దొంగలు ప్రయాణిస్తున్న కారును గుర్తించిన ఆయన దానిని వెంబడించారు. దొంగలను నిలువరించే క్రమంలో ఓ రౌండ్ కాల్పులు కూడా జరిపారు. అయితే చాకచక్యంగా కాల్పుల నుంచి తప్పించుకున్న ఆ గ్యాంగ్ తమ సొంత రాష్ట్రం మహారాష్ట్ర వైపు పరారైంది. ఈ ముఠా కోసం ప్రస్తుతం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News