: ఒక అమ్మాయిని 20 సార్లు అమ్మారు...ఐఎస్ దురాగతాలకు ఓ ఉదాహరణ!
తీవ్రవాదులు కలలు కంటున్న ఇస్లాం సామ్రాజ్యం ఎలా ఉంటుందో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రుచి చూపుతున్నారు. ఐఎస్ఐఎస్ దురాగతాలు వింటే ఎవరికైనా సరే ఆగ్రహం వస్తుంది. ఇరాక్ లోని సిజార్ పర్వత శ్రేణుల్లో ఉన్న మైనారిటీ తెగ యాజాదీలు. గత ఆగస్టులో ఈ ప్రాంతంపై ఐఎస్ ఉగ్రవాదులు దాడికి దిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టుబడిన పురుషులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. మహిళలను, యువతులను వేరు చేసి సిరియాలోని అల్ రఖా నగరానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో బందీలుగా దొరికిన యువతులు, మహిళలపై వర్ణనాతీతమైన హింసకు పాల్పడ్డారు. అత్యాచారాలు చేశారు. అనంతరం అల్ రఖా నగరంలో బందీలైన యువతులను అమ్మేశారు. కేవలం సిగిరెట్ ప్యాకెట్ కు ఓ యువతిని అమ్మేశారంటే అక్కడ మహిళలకు వారిచ్చే విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో అమ్మాయిని పది డాలర్లకు అమ్మేశారు. వీరిని కొనుగోలు చేసిన వారు వారిని అంగట్లో బొమ్మల్లా చూసేవారు. వారి శరీరంతో ఆడుకునే వారు. మోజు తీరాక ఇంకొకరికి అమ్మేసేవారు. ఇలా ఓ అమ్మాయిని 20 సార్లు అమ్మేశారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ బందీలలో కొద్ది మంది తప్పించుకోగా, ఎక్కువ మంది తప్పించుకునే క్రమంలో మృత్యువాత పడ్డారు. కొందరు ఎదురు తిరిగి అసువులు బాసారు. మరి కొందరు ఐఎస్ తీవ్రవాదుల ఆగ్రహానికి, సరదాకి అంతమయ్యారు. తీవ్రవాదుల చెరలో ఇంకా రెండు నుంచి మూడు వేల మంది యాజాదీ మహిళలు బానిసలుగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.