: కాల్ మనీపై ఏపీ డీజీపీ, సీఎస్ లకు నోటీసులు
విజయవాడలో కాల్ మనీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేయనున్నట్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించారు. ఈ దందాలో నిజానిజాలు తెలుసుకునేందుకు విజయవాడకు ఓ బృందాన్ని పంపించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మధ్యాహ్నం ఏపీ కాంగ్రెస్ నేతలు ఆయన్ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం జస్టిస్ జోసెఫ్ మీడియాతో మాట్లాడారు. తాను విన్నదాన్ని బట్టి ఈ తరహా ఘటనలు అత్యంత దారుణమని అభివర్ణించిన ఆయన, నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, అంతకుముందు ఏపీ కాంగ్రెస్ నేతలు తమ ఫిర్యాదులో చంద్రబాబే కేసులో మొదటి ముద్దాయని, ఆయన శిష్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసులో భాగముందని పేర్కొన్నారు. ఇప్పటికే వేలాది కుటుంబాలను ఈ గ్యాంగు దోచుకుందని ఆరోపించారు. విజయవాడ పోలీసు కమిషనర్ ను సెలవుపై పంపడం కేసును తప్పుదారి పట్టించేందుకేనని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఇండియాలోనే అతిపెద్ద ఆర్థిక, సెక్స్ రాకెట్ గా కాల్ మనీ ఉందని చెప్పిన ఆయన, దుర్మార్గులు వందల మంది మహిళల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు.