: ముంబై పోలీసు స్టేషన్లలో డ్యాన్స్ బార్ల లైవ్!
ముంబై మహానగరంలో డ్యాన్స్ బార్లను తిరిగి పునరుద్ధరించాలన్న సుప్రీంతీర్పుతో ఆలోచనలో పడ్డ మహారాష్ట్ర సర్కారు, ఆచరణలో కష్టసాధ్యమైన నిబంధనలతో ముసాయిదాను సిద్ధం చేసింది. డ్యాన్స్ బార్లలోని సీసీ కెమెరాలను సమీపంలోని పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేసి, లైవ్ వీడియోను అందించాలన్నది ఇందులోని ముఖ్యాంశంగా తెలుస్తోంది. ఇదే సమయంలో నిమిషానికో చిత్రం తీసే ఏర్పాటు చేసి, అవి కూడా వెంటనే స్టేషన్లకు చేరిపోయేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక డ్యాన్స్ బార్ లు అంటేనే, అక్కడో గ'మత్తయిన' వాతావరణం ఉంటుంది. పోలీసులు తమను కనిపెట్టి వున్నారని తెలిసిన కస్టమర్లు ఈ తరహా బార్లను ఆదరించరన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుండగా, స్టేషన్లకు లైవ్ పంపడాన్ని వ్యతిరేకిస్తామని, దాని బదులు పూర్తి నిషేధం అంటే బాగుంటుందని బార్ల యజమానులు అంటున్నారు. ఇదే సమయంలో డ్యాన్స్ ఫ్లోర్ పై నృత్యం చేసే వారి సంఖ్యను గరిష్ఠంగా 4కు కుదించాలని, వారికి 2 మీటర్ల కనీస దూరం వరకూ కస్టమర్లు ఉండరాదని, 18 ఏళ్ల లోపు యువతులతో నృత్యాలు చేయించరాదని, డ్యాన్సర్లతో కలసి ఎట్టి పరిస్థితుల్లోను కస్టమర్లు నృత్యం చేయకుండా చూడాలని నిబంధనలు పెట్టినట్టు సమాచారం. కాగా, అశ్లీలత పెరగకుండా చూసేందుకే కొత్త నిబంధనలు చేర్చినట్టు మహారాష్ట్ర హోం శాఖ కార్యదర్శి విజయ్ సత్బీర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ నిబంధనలు అమలైతే పోలీసులకు మాత్రమే ప్రయోజనాలు చేకూరుతాయని, వారి నుంచి ఇబ్బందులు పెరిగి తాము మరింతగా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని ముంబై బార్ ఓనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మన్ జీత్ సింగ్ సేథీ వ్యాఖ్యానించారు.