: రాజశేఖర రెడ్డిని చంద్రబాబు చంపించినట్టు కాదా?: జగన్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు . ప్రతి విషయంపై రాద్ధాంతం చేస్తూ, ఇతర పార్టీల నేతలపై దొంగ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. బాక్సైట్ గనుల విషయంలో వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాటవరుసకు మాట్లాడుతూ, చంద్రబాబు తల నరుకుతామంటే... హత్యాయత్నం కేసు పెట్టారని అన్నారు. వైకాపాకు చెందిన ఎంపీ మిథున్ రెడ్డి విమానాశ్రయ అధికారులతో గొడవపడ్డారని తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. చంద్రబాబు తప్పులను ప్రశ్నిస్తున్న ప్రతి నేతనూ కేసుల్లో ఇరికిస్తున్నారని చెప్పారు. టీడీపీకి చెందిన చింతమనేని ప్రభాకర్ లాంటి నేతలు ఎన్నో దారుణాలు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డిని హెచ్చరిస్తూ... నీవు ఈసారి అసెంబ్లీలో అడుగుపెడితే కదా? అని చంద్రబాబు అన్నారని... అది జరిగిన రెండు రోజులకే రాజశేఖరరెడ్డి దుర్మరణం పాలయ్యారని... దానర్థం రాజశేఖరరెడ్డిని చంద్రబాబు చంపించినట్టు కాదా? అని జగన్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై సీబీఐ విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. లంచాలు తీసుకుని... బాక్సైట్ గనులకు చంద్రబాబు సహకరిస్తున్నారని ఆరోపించారు. కాల్ మనీ కేసులో టీడీపీ నేతలున్నా కేసులు పెట్టడం లేదని మండిపడ్డారు. ఈ వ్యవహారాలన్నింటిలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరానని చెప్పారు.

  • Loading...

More Telugu News