: వ్యక్తిగత అవసరాల కోసమే ఇద్దరూ కలిశారు: గుత్తా
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లపై టి.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. విభజన సమస్యలు ఎన్నో ఉన్నప్పుడు, వాటిపై మాట్లాడుకోకుండా గతంలో ఘర్షణ పడ్డ వీరిద్దరూ... ఇప్పుడు ఒకటవుతున్నారని విమర్శించారు. కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే వీరు కలుస్తున్నారని ఆరోపించారు. వీరిద్దరి అవకాశ వాదాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ కేసీఆర్ చండీయాగం చేస్తున్నారని... ఏర్పాట్ల కోసం అధికార యంత్రాంగాన్ని మొత్తం అక్కడే తిప్పుతున్నారని విమర్శించారు. ఈ యజ్ఞాలు, యాగాలు ఏమిటి... మనం త్రేతాయుగం, ద్వాపరయుగంలోకి వెళుతున్నామా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇతర సమస్యల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.