: అమెరికా వడ్డీ రేట్లకు అంత ప్రాధాన్యత ఎందుకంటే..?


ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వర్గాలు, పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల యజమానులు, ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. బుధవారం జరిగే ఈ సమావేశంలో అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం వెలువడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దాదాపు పది సంవత్సరాల తరువాత అమెరికాలో వడ్డీ రేట్లు పెంచినట్లవుతుంది. యూఎస్ ఫెడ్ పుట్టిస్తున్న భయాలతో వరల్డ్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో యూఎస్ వడ్డీ రేట్లకు అంత ప్రాధాన్యత ఎందుకో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫెడ్ వడ్డీ రేటుకు ప్రాధాన్యత: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వ్ బ్యాంకు. ఈ సంస్థ తీసుకునే నిర్ణయం మొత్తం ఆర్థిక ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. రాత్రికి రాత్రే స్వల్ప, దీర్ఘకాల పెట్టుబడులు, డిపాజిట్లపై వడ్డీ మారిపోతుంది. గతంలో ఇళ్లు, వాహనాలను రుణాలు తీసుకుని కొన్నవారు మరింతగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలు దాచుకునే డబ్బుపై బ్యాంకులు అధిక వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఫెడ్ రేటు కనిష్ఠంగా 0, గరిష్ఠంగా 0.25 శాతంగా ఉంది. ఇది కనీసం మరో పావు శాతం పెరిరినా అది వరల్డ్ మార్కెట్లకు నెగటివ్ సెంటిమెంటే. అత్యంత విలువైన అమెరికా బాండ్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగి స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ పెట్టుబడులు బాండ్లకు తరలిపోతాయి. ఈ వారంలో నిర్ణయం ఎందుకు ఇంపార్టెంటంటే..?: డిసెంబర్ 2008 నుంచి యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు 0.25 శాతం మించరాదన్న నిబంధనను అమలు చేస్తోంది. అప్పట్లో లీమన్ బ్రదర్స్ పతనం తరువాత ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాంద్యమే ఇందుకు కారణం. అప్పటి నుంచి వడ్డీ రేట్లు మారలేదు. వడ్డీ రేట్లను కనీసం 0.25 నుంచి గరిష్ఠంగా 0.50 శాతం వరకూ మార్చాలన్న ఒత్తిడి ఫెడరల్ రిజర్వ్ పై ఎంతో కాలంగా ఉంది. మాంద్యం నుంచి తేరుకున్న తరువాత కూడా వడ్డీ రేట్లను పెంచకపోవడంపై ఓ దశలో ఫెడ్ పై విమర్శలు కూడా వచ్చాయి. అందువల్లే ఈ దఫా సమావేశాల్లో వడ్డీ పెరగవచ్చని అంచనా. పడే ప్రభావం ఇదే: వడ్డీ రేట్ల పెంపు ప్రభావం తొలుత పడేది స్టాక్ మార్కెట్ల పైనే. ఈ సంగతి ఇన్వెస్టర్లందరికీ తెలుసు. అందువల్లే గత కొంతకాలంగా మార్కెట్లు స్తబ్దుగా సాగుతున్నాయి. ఇటీవలి కాలంలో డాలర్ బలపడటంతో ఫెడ్ నిర్ణయం ఎలా వున్నా అమెరికన్ మార్కెట్ పై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో విదేశీ పెట్టుబడులు అధికంగా ఉన్న భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై మాత్రం కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశం నుంచి డాలర్లు తరలిపోతాయి కాబట్టి రూపాయి మరింతగా పడిపోయే ప్రమాదముంది. వడ్డీ రేట్ల పెంపు తప్పదా?: ఫెడ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియనప్పటికీ, 'వాల్ స్ట్రీట్ జర్నల్' ఓ సర్వే నిర్వహిస్తే, అందులో పాల్గొన్న 97 శాతం మంది ఆర్థికవేత్తలు ఫెడ్ నిర్ణయం వడ్డీ రేట్ల పెంపువైపే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక ఏదిఏమైనా ఫెడ్ నిర్ణయం రేపు వెలువడుతుంది కాబట్టి సస్పెన్స్ తీరిపోతుంది.

  • Loading...

More Telugu News