: మస్తాన్ బీ కోరిక తీర్చిన అల్లు అర్జున్... ఆప్యాయంగా పాయసం తినిపించిన మస్తాన్ బీ
క్యాన్సర్ తో బాధపడుతూ రోజులు లెక్కబెడుతున్న తన అభిమాని చివరి కోరికను తీర్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, విరామం తీసుకుని అభిమానిని కలిశాడు. 65 ఏళ్ల మస్తాన్ బీ విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో నివాసం ఉంటోంది. గతంలో అల్లు రామలింగయ్యకు ఆమె వీరాభిమాని. ఆ తర్వాత అల్లు అర్జున్ కి ఫ్యాన్ అయిపోయింది. అల్లు అర్జున్ నటన అన్నా, డ్యాన్స్ అన్నా ఆమెకు ఎంతో ఇష్టం. ఈ క్రమంలో ఆమెకు క్యాన్సర్ వ్యాధి ముదిరింది. ఇంకో ఆరు నెలలు బతకడం కూడా కష్టం. ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ ను ఒకసారైనా చూడాలనేది ఆమె కోరిక. ఈ విషయం అల్లు అర్జున్ కు తెలిసింది. ఆమె కోరిక తీర్చాలనుకున్న అల్లు అర్జున్ నేరుగా విజయవాడలోని ఆమె నివాసానికి చేరుకున్నాడు. అల్లు అర్జున్ ను చూసిన ఆనందంతో ఆమె ఉబ్బితబ్బిబ్బు అయింది. ఆప్యాయంగా అల్లు అర్జున్ కి తన చేతులతో పాయసం తినిపించింది. అనంతరం ఆమెకి పండ్లను అందజేశాడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్జున్ ను చూసిన తర్వాత తనకు క్యాన్సర్ ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయానని ఆనందం వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ తనకు మనవడిలాంటి వాడని చెప్పింది. ఓ పేదరాలి కోసం అర్జున్ ఇంత దూరం రావడం ఆయన గొప్పదనం అని తెలిపింది. అల్లు అర్జున్ భార్య, పిల్లలతో చల్లగా ఉండాలని దేవుడిని ప్రార్థించింది.