: అన్నా! వరద వస్తే... మీ ఇల్లు మునగదా?: కేసీఆర్ ప్రశ్నకు నవ్వేసిన చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుల మధ్య నిన్న విజయవాడలో ఆసక్తికర చర్చ జరిగింది. తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 23 నుంచి చేపట్టనున్న అయుత చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కేసీఆర్ నిన్న నేరుగా విజయవాడకు వెళ్లిన సంగతి తెలిసిందే. విజయవాడలోని కృష్ణా కరకట్టలను ఆనుకుని ఉన్న చంద్రబాబు తాత్కాలిక నివాసం వద్ద కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండైంది. ఆ తర్వాత ఏపీ మంత్రులతో కలిసి చంద్రబాబు నివాసంలోకి వెళ్లిన కేసీఆర్ అక్కడే చాలాసేపు గడిపారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు ఓ వినూత్న ప్రశ్న సంధించారు. ‘‘ అన్నా! నేను హెలికాప్టర్లో వస్తూ చూశాను. మీ ఇంటి వద్ద నదిలో నీళ్లు నిండుగా ఉన్నట్లు అనిపించింది. ఈ కాలంలోనే ఇలా ఉంటే, వరదలు వచ్చినప్పుడు మీ ఇల్లు మునగదా? వరదలు వచ్చినప్పుడు రాజధాని ప్రాంతానికి ఇబ్బంది లేదా?’’ అని చంద్రబాబును కేసీఆర్ అడిగారు. ఈ ప్రశ్నలకు ఓ చిరునవ్వు నవ్విన చంద్రబాబు ‘‘పైనుంచి చూస్తే నది నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, అది నిజం కాదు. వీటీపీఎస్ ధర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం నదిలో ఆ నీటిమట్టం నిర్వహిస్తుంటారు. లేకపోతే వీటీపీఎస్ ఆగిపోతుంది. రాజధాని ప్రాంతానికి కూడా ఇబ్బంది లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్నాం. వందేళ్లలో వచ్చిన వరదల లెక్కలు తీసి, అంతకు 50 శాతం అధికంగా వరద వచ్చినా సమస్య రాకుండా జాగ్రత్త పడుతున్నాం’’ అని సమాధానమిచ్చారు. చంద్రబాబు చెప్పిన సమాధానాన్ని ఆసక్తిగా విన్న కేసీఆర్, ఆ తర్వాత కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.