: ఆ సిరీస్ ముగిసిన అధ్యాయం: పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్
భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ పై బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండు దేశాల మధ్య జరగాల్సిన క్రికెట్ సిరీస్ ముగిసిన అధ్యాయంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఆ సిరీస్ పై తమకు ఎంతో కొంత ఆశలు ఉన్నా దానిపై పెద్దగా ఆసక్తి చూపడంలేదని తెలిపారు. గత వారంలో భారత్-పాక్ ల క్రికెట్ సిరీస్ పై బీసీసీఐకి షహర్యార్ లేఖ రాశారు. ఆ సిరీస్ కు సంబంధించి బీసీసీఐ రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. ఒకవేళ ద్వైపాక్షిక సిరీస్ జరగకుంటే వచ్చే ఏడాది భారత్ లో జరిగే ట్వంటీ20 వరల్డ్ కప్ ను తమ జట్టు బాయ్ కాట్ చేస్తుందని లేఖలో వివరించారు. అయితే ఇంతవరకు బీసీసీఐ నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో ఇవాళ మళ్లీ ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సిరీస్ విషయంలో నడిచిన వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దృష్టికి తీసుకువెళ్లడమే తమ ముందున్న మార్గమని షహర్యార్ చెప్పారు.