: ఆ చిన్నారి ముందే చనిపోయింది: రైల్వే మంత్రి సురేష్ ప్రభు
ఢిల్లీలో ఆక్రమిత గుడిసెల కూల్చివేతకు, చిన్నారి మరణానికి సంబంధం లేదని రైల్వే మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటులో ప్రకటించారు. ఆక్రమణల తొలగింపునకు ముందుగానే ఆ పాప మరణించిందని ఆయన తెలిపారు. "రైల్వే స్థలాలను ఖాళీ చేయాలని ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చాం. వారు స్పందించలేదు. మేమేమీ అర్ధరాత్రి పూట వెళ్లి గుడిసెలు కూల్చలేదు. మొత్తం ప్రశాంతంగా సాగింది. ఆ పాప కూల్చివేతల కారణంగా చనిపోలేదు. అంతకన్నా ముందే మరణించింది. పాప మృతికి కారణాలు పోస్టు మార్టంలో తెలుస్తాయి" అని ఆయన తెలిపారు. ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో చర్చలకు తాను సిద్ధమేనని కూడా ప్రభు వివరించారు. కాగా, పశ్చిమ ఢిల్లీలో భాగమైన షాకూర్ బస్తీలో 500 గుడిసెల తొలగింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.