: రాహుల్ ఆలయ ప్రవేశాన్ని అడ్డుకున్న మహిళలు ... మోదీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ యువరాజు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అసోం పర్యటనలో భాగంగా నిన్న ఊహించని ఘటన ఎదురైంది. పర్యటనలో భాగంగా ఓ ఆలయంలోకి ప్రవేశించాలనుకున్న రాహుల్ ను ఆరెస్సెస్, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగనప్పటికీ, మహిళలను ప్రవేశద్వారం వద్ద నిలబెట్టి రాహుల్ ఆలయ ప్రవేశాన్ని అడ్డుకున్నారు. దీనిపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్, బీజేపీ నేతల చర్యలు ప్రధాని నరేంద్ర మోదీ మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ‘‘అసోం పర్యటనలో నిన్న బార్ పేటలోని ఓ ఆలయంలోకి ప్రవేశించాలనుకున్నాను. అయితే ఆరెస్సెస్, బీజేపీ నేతలు నన్ను అడ్డుకున్నారు. ప్రవేశ ద్వారం వద్ద మహిళలను వరుసపెట్టి నిలబెట్టి వారు నన్ను అడ్డుకున్నారు. వారి చర్యలు మోదీ మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.