: మూడు నెలల వ్యవధిలో సగానికి తగ్గిన ఐఫోన్ల ధర!
గడచిన మూడు నెలల వ్యవధిలో యాపిల్ ఐఫోన్ 5 ఎస్ ధరలు సగానికి పైగా తగ్గాయి. ఇండియాలో యాపిల్ కు బెస్ట్ సెల్లర్ గా ఉన్న ఈ ఫోన్ ధర విడుదలైన నాటితో పోలిస్తే సగానికే లభిస్తోంది. ఐఫోన్ 6 సిరీస్ ఫోన్లు విడుదల కాకముందు, సెప్టెంబరులో రూ. 44,500గా ఉన్న ఐఫోన్ 5 ఎస్ ధరలు ఇప్పుడు రూ. 24,999 ధరకే లభిస్తున్నాయి. ఈ ధర ప్రపంచంలోనే 5ఎస్ కు అతి తక్కువని తెలుస్తోంది. సాధారణంగా ఇండియాలో రూపాయి మారకపు విలువ కారణంగా యాపిల్ ఉత్పత్తుల ధరలు అధికంగా ఉంటాయి. కానీ, ఇక్కడి అపారమైన మార్కెట్లో మరింత వాటా కోసం యాపిల్ సంస్థ కొన్ని మెట్లు దిగి ధరలను తగ్గిస్తుండటం గమనార్హం. ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ధరలు అధికంగా ఉండటంతో, దానికి ముందు వర్షన్ అమ్మకాలను మరింతగా పెంచుకోవాలన్నది యాపిల్ అభిమతంగా తెలుస్తోందని స్మార్ట్ ఫోన్ వ్యాపారులు అంటున్నారు. అక్టోబరులో దసరా సందర్భంగా ఓ సారి, ఆపై దీపావళి సందర్భంగా మరోసారి యాపిల్ 5ఎస్ ఫోన్ల ధరలు తగ్గించిన సంస్థ, తాజాగా మరోసారి డిస్కౌంటును ప్రకటించింది. కాగా, సెప్టెంబర్ 2015 నాటికి ఇండియాలో 12 లక్షల 5ఎస్ వేరియంట్లు అమ్ముడైనట్టు అంచనా.