: ధనవంతుల దురదృష్టం... 18 నెలల్లో సగం సంపద హారతి!
డౌ చార్నీ... ప్రస్తుతం దివాలా తీసిని అమెరికన్ అపెరల్ వ్యవస్థాపకుడు. ఏడాదిన్నర క్రితం వరకూ ఆయనకున్న సంపాదనతో పోలిస్తే ఇప్పుడు మిగిలింది సగం కన్నా తక్కువే. శామ్ విలీ... కంప్యూటర్ కంపెనీల నుంచి చిన్నా చితకా వెబ్ సైట్ల వరకూ డజన్ల కొద్దీ కొని అమ్మాడు. తన ఆస్తిలో సగానికి పైగా హారతి కర్పూరం చేసుకున్నాడు. వీరిద్దరూ స్వశక్తితో ఎదిగిన వారే. కానీ, గడచిన ఏడాదిన్నరలో వీరి ఆస్తులు సగానికి పైగా పడిపోయాయి. న్యూయార్క్ టైమ్స్ కోసం వెల్త్-ఎక్స్ సంస్థ రీసెర్చ్ చేసి విడుదల చేసిన గణాంకాలు ధనవంతులైనా, వారిని వెన్నాడే దురదృష్టం గురించి కూడా ప్రస్తావించింది. డౌ చార్నీ, శామ్ విలీలకు తోడుగా సంపదను పోగొట్టుకున్న వారి జాబితా కాస్తంత ఎక్కువగానే ఉంది. జూలై 2014 నుంచి జూలై 2015 మధ్య యూఎస్ లోని ధనవంతుల్లో 45 శాతం మంది ఎంతో కొంత సంపదను కోల్పోయారు. 11 శాతం మంది సగం ఆస్తులను పోగొట్టుకుంటే, 12 శాతం మంది 25 శాతం నుంచి 50 శాతం వరకూ, 22 శాతం మంది ధనవంతులు 25 శాతం వరకూ ఆస్తులను పోగొట్టుకున్నారు. కనీసం 30 మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులున్న వారిని రీసెర్చ్ లో భాగం చేయగా, ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ లోపాల కారణంగానే ఆస్తులు పోయాయని వెల్త్-ఎక్స్ వెల్లడించింది. అధిక డబ్బును ఒకే చోట పెట్టుబడిగా పెట్టడం అత్యధికులు చేసిన తప్పని, అదే వారి సంపద హరించుకుపోవడానికి కారణమైందని వివరించింది. మొత్తం మీద అమెరికాలో ధనవంతుల సరాసరి ఆస్తుల విలువ 133 మిలియన్ డాలర్ల నుంచి 34 మిలియన్ డాలర్లకు పడిపోయిందని తెలియజేసింది.