: తమిళ నటుడు శింబు, 'వై దిస్ కొలవెరి' ఫేం అనిరుధ్ ల అరెస్ట్ కు సన్నాహాలు!
తమిళనాట పెను వివాదం సృష్టించిన 'బీప్ సాంగ్' వివాదంలో పాట పాడిన హీరో శిలంబరసన్ అలియాస్ శింబు, సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ (వై దిస్ కొలవెరి ఫేం)లను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అసభ్య పదాలతో యువతులను అవమానించేలా ఈ పాట ఉండటంతో, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోయంబత్తూరు పోలీసు స్టేషన్లో ఐద్వా కార్యదర్శి రాధిక, మహిళా వేధింపుల చట్టం కింద కేసు కూడా పెట్టారు. మరోవైపు కోవై కమిషనర్ ఈ కేసును సైబర్ క్రైం విభాగానికి బదిలీ చేయాలని ఆదేశించడంతో, వీరిద్దరి అరెస్టు తప్పదేమోనని సినీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. ఈ పాటకు అర్థం కూడా తెలియకుండా చిన్నారులు వివిధ స్టేజ్ షోల్లో పాట పాడుతుండటంతో పలువురు తల్లిదండ్రులు సామాజిక మాధ్యమాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పాట పాడింది శింబు కాదని, తమ హీరో ఇటువంటి పాటను పాడివుండడని ఆయన అభిమానులు అంటున్నారు. ఈ పాటలకు వాయిస్ టెస్ట్ చేసి వాస్తవాన్ని వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో శింబు అధికారికంగా స్పందించనప్పటికీ, ఆ పాటకు సంగీతాన్ని తాను సమకూర్చలేదని అనిరుధ్ నిన్న రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తనను అగౌరవ పరిచేందుకు కుట్ర పన్ని తనను ఇరికించారని ఆరోపించారు. పోలీసులు మాత్రం ఈ కేసును కాస్తంత సీరియస్ గానే తీసుకుని వాయిస్ ఎనలైజ్ పరీక్షలు చేయాలని, ఆపై సెలబ్రిటీల అరెస్టుపై ముందడుగు వేయాలని భావిస్తున్నట్టు సమాచారం.