: కాల్ మనీ నిందితుల్లో ట్రాన్స్ కో డీఈ... సస్పెండ్ చేసిన హెచ్.వై. దొర
బెజవాడ వాసులను జలగల్లా పట్టిపీడిస్తున్న కాల్ మనీ నిర్వాహకుల్లో పోలీసులు, పలువురు రాజకీయ నేతలు ఉన్నారన్న వదంతులు నిజమయ్యాయి. ఏపీ ట్రాన్స్ కోలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ)గా పనిచేస్తున్న సత్యానందం ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు మొన్న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సత్యానందాన్ని ఏ4 నిందితుడిగా చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీఎస్పీడీసీఎల్ సీఎండి హెచ్.వై.దొర నిన్న కొరడా ఝుళిపించారు. విజయవాడ సర్కిల్ లో టెక్నికల్ డీఈగా పనిచేస్తున్న సత్యానందాన్ని ఆయన సస్పెండ్ చేస్తూ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఓ వైపు విజయవాడలో నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ మీడియా సమావేశంలో ఉండగా, అటు తిరుపతిలో హెచ్.వై.దొర సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.