: రాజకీయ ఒత్తిడి లేదు... ‘కాల్ మనీ’ కోరలు పీకేస్తాం: విజయవాడ కమిషనర్ గౌతం సవాంగ్
బెజవాడలో పెను సంచలనం రేపిన కాల్ మనీ వ్యవహారంపై నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఉక్కుపాదం మోపారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఆయన కాల్ మనీ నిర్వాహకుల్లో కీలకంగా వ్యవహరించిన యలమంచిలి శ్రీరామమూర్తి, దూడల రాజేశ్ లను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 376,354(ఏ), 384 ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ మేరకు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సవాంగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్ మనీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తులో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని ఆయన పేర్కొన్నారు. కేసులో ప్రమేయం ఉన్న వారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసు దర్యాప్తులో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని ఆయన ప్రకటించారు.