: నా ప్రమేయాన్ని నిరూపించండి... భారత్ కు హఫీజ్ సయీద్ సవాల్!
ముంబై మారణ హోమంలో తన ప్రమేయాన్ని నిరూపించాలని జమాత్ ఉద్ దవా చీఫ్, దాడుల కీలక సూత్రధారిగా భావిస్తున్న హఫీజ్ సయీద్ భారత్ కు సవాల్ విసిరాడు. దాడులు జరిగి ఏడేళ్లు గడిచినా ఇప్పటిదాకా తన ప్రమేయానికి సంబంధించి భారత్ ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయిందని అతడు వ్యాఖ్యానించాడు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల పాకిస్థాన్ లో పర్యటించిన తర్వాత అతడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘ ముంబై దాడులు జరిగి ఏడేళ్లు గడుస్తోంది. ఇప్పటిదాకా వారు నిరూపించింది ఏమీ లేదు. కోర్టు తీర్పు వెలువరించేదాకా కూడా ఏమీ నిరూపించలేరు. వారు ఏమి చెప్పినా, నేను సుష్మాకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగానే ఉన్నా’’ అని అతడు వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఓ వీడియో విడుదలైంది. ప్రస్తుతం ఈ వీడియో భారత విదేశాంగ శాఖ అధికారులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.