: హైదరాబాదులో మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన కాలేజ్ బస్సు...ఒక మహిళ మృతి
ఒక మెడికల్ షాపులోకి కాలేజ్ బస్సు దూసుకెళ్లడంతో ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డ సంఘటన ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. గురునానక్ కళాశాల బస్సు విద్యార్థులను డ్రాప్ చేసేందుకని బయల్దేరింది. బస్సు బ్రేక్ లు పనిచేయకపోవడంతో హుస్సేనీ అలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్ లోని ఒక మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా రోడ్డుపై వాహనాలను ఇష్టమొచ్చినట్టు ఢీ కొట్టుకుంటూ వెళ్లడంతో నాలుగు బైకులు తీవ్రంగా ధ్వంసమవ్వగా ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులను చెదరగొట్టారు. డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని, బస్సును స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా, ఫిట్ నెస్ లేని బస్సులను ఎందుకు పట్టించుకోవట్లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.