: సొంతింటికి దగ్గరయ్యే సమయం... 15 శాతం పెరిగిన గృహ విక్రయాలు


గడచిన అక్టోబర్ - నవంబర్ మాసాల్లో పండగల సీజన్ భారత నిర్మాణ రంగానికి కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ఇటీవలి కాలం వరకూ స్తబ్ధుగా ఉన్న గృహాల క్రయ విక్రయాలు ఊపందుకోగా, గత సంవత్సరంతో పోలిస్తే 10 నుంచి 15 శాతం వరకూ లావాదేవీలు పెరిగాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఢిల్లీ సహా, ముంబై, చెన్నై తదితర నగరాల్లో సొంతింటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించారు. "ఇండ్లకు డిమాండ్ పెరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. గత ఏడాదిన్నర వ్యవధిలో ఇండ్ల ధరలు 20 శాతం వరకూ తగ్గడం ప్రజలను ఆకర్షించింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు దసరా, దీపావళి సీజన్ లో అధికంగా ఇళ్లు కొన్నారు" అని క్రెడాయ్ అధ్యక్షుడు జీతాంబర్ ఆనంద్ వ్యాఖ్యానించారు. కాగా, గోద్రేజ్ ప్రాపర్టీస్ సంస్థ గత రెండు నెలల్లో 300 అపార్టుమెంట్లను విక్రయించి రూ. 700 కోట్ల ఆదాయాన్ని పొందింది. "నిర్మాణ రంగంలో రికవరీ కనిపిస్తోంది. గుర్ గాంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టును తలపెడితే ఓ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ రూ. 450 కోట్ల నిధులను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది" అని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ఇన్వెస్టార్స్ క్లినిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హనీ కతియాల్ వ్యాఖ్యానించారు. ఇక దేశ రాజధానిలో అమ్రపాలీ ప్రారంభించిన భారీ 'అఫర్డబుల్' ప్రాజెక్టు లో 5 వేల యూనిట్లను ప్రకటిస్తే, దీనికి కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. పది రోజుల వ్యవధిలో 1000కి పైగా యూనిట్లు బుక్ అయ్యాయి. "ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు తగ్గడం కూడా ఈ రంగం తిరిగి నిలదొక్కుకునేందుకు కారణమైంది. మధ్యతరగతి ప్రజలు తమ కలలను సాకారం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. రెండేళ్ల క్రితం రూ. 25 లక్షలు పలికిన అపార్టుమెంటు ఇప్పుడు రూ. 18 లక్షల నుంచి రూ. 20 లక్షలకే లభించడం, వడ్డీ రేట్లు తగ్గడంతో ముందు ముందు అమ్మకాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నాం" అని నిర్మాణ రంగంలో ట్రాకింగ్ సేవలందిస్తున్న సంస్థ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. మంచి బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీలు నిర్మిస్తున్న గృహాలకు అధిక డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. సమయానికి నిర్మాణం పూర్తి చేసి డెలివరీ ఇస్తామన్న పేరున్న మంచి డెవలపర్లు మంచి ప్రాజెక్టులను చేపడితే ఈ డిమాండ్ ను ఇలాగే కొనసాగించవచ్చని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ పిరోజ్ షా గోద్రేజ్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News