: రూ. 50 వేలు తీసుకుని, రూ. 2 లక్షలు కట్టినా... వ్యభిచారం చేయాలన్న దేశం నేత... బెజవాడ కాల్ మనీ లీలలు!
విజయవాడ కాల్ మనీ వ్యవహారంలో బాధితులు పోలీసు స్టేషన్ల ముందు క్యూ కడుతున్నారు. మోహన్ అనే తెలుగుదేశం పార్టీలో తిరిగే ఓ వ్యక్తి వద్ద తాను రూ. 50 వేలు తీసుకుని ఇప్పటికే రూ. 2 లక్షలు కట్టానని ఓ బాధిత మహిళ తన గోడును మీడియా వద్ద వెళ్లబోసుకుంది. ఏడాదిన్నరగా నెలకు రూ. 10 వేల చొప్పున కడుతున్నానని, అయినా అప్పు తీరలేదని చెబుతూ తన ఇంటి కాగితాలు తీసుకుపోయారని, వాటి గురించి అడిగితే, వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చారని ఓ మహిళ వాపోయింది. తనతో 50 రూపాయల బాండ్ పై సంతకాలు చేయించుకున్నారని చెప్పింది. తాను చెప్పిన చోటుకు వస్తుంటే, రోజుకు రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకూ సంపాదించవచ్చని, ఆ డబ్బు తనకు జమ కట్టాలని మోహన్ తనను వేధించాడని ఆమె తెలిపింది. డబ్బు ఇవ్వకుంటే కేసు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతానని బెదిరించాడని వివరించింది. ఇదే విషయాన్ని పోలీసులకు చెబితే, వారు ఎంత కట్టగలవు? అని అడిగారని, మధ్యవర్తిత్వం చేసి కేసు లేకుండా చేస్తామన్నారే తప్ప, మోహన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని వెల్లడించింది. ఇటువంటి బాధితులు ప్రస్తుతం వందల సంఖ్యలో బెజవాడ పోలీసు స్టేషన్లలో తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.