: మిస్టరీ... ఆ 296 మంది ఏజేఎల్ వాటాదారులు ఏమైనట్టు?
ది అసోసియేటెడ్ జర్మన్ (ఏజేఎల్)... ఇటీవల రాజకీయ సంచలనాలకు వేదికైన నేషనల్ హెరాల్డ్, ఖవామీ ఆవాజ్ పత్రికల యాజమాన్య సంస్థ. ఈ సంస్థలో ఉన్న వాటాదారుల సంఖ్యలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతున్న దానికి, కాంగ్రెస్ వాదనకు పొంతన లేకుండా ఉంది. సంస్థలో 1,057 మంది వాటాదారులు ఉన్నట్టు సెప్టెంబర్ 29, 2010న ఏజేఎల్, తన వార్షిక నివేదికలో వెల్లడించగా, కాంగ్రెస్ నేతలు, మాజీ కేంద్రమంత్రులు కపిల్ సిబల్, పి చిదంబరం ఏజేఎల్ లో 761 మంది వాటాదారులు ఉన్నట్టు మాత్రమే ఇటీవల వెల్లడించడం కొత్త మిస్టరీకి తెరలేపింది. ఈ సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? మిగతా 296 మంది ఏమయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై పడింది. సెప్టెంబర్ 30, 2009న సంస్థలో 1,062 మంది వాటాదారులు ఉన్నారని, ఆపై ఏడాదికి వారి సంఖ్య 1,057కు తగ్గిందని, తిరిగి 2011లో 1,089కి పెరిగిందని వెల్లడించిన ఏజేఎల్, అప్పటి నుంచి 2014 వరకూ ఇన్వెస్టర్ల సంఖ్య పెరగలేదని వెల్లడించింది. అంటే, 2010, 2011 మధ్య 32 మంది ఇన్వెస్టర్లు పెరిగారు. ఇక్కడ 2010లో ఇన్వెస్టర్ల సంఖ్య కీలకాంశం. ఎందుకంటే, ఓ నాన్ ప్రాఫిట్ కంపెనీగా రిజిస్టర్ అయిన యంగ్ ఇండియా ఏజేఎల్ లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసే లావాదేవీపై ఆనాడు ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది కాబట్టి. నిన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం, కపిల్ సిబల్ ను షేర్ హోల్డర్ల సంఖ్యపై ప్రశ్నిస్తే, "ఏజేఎల్ లో 761 మంది వాటాదారులు ఉన్నారు. వారిలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తాతయ్య, మాజీ హోం మంత్రి కైలాసనాథ్ కట్జూ కూడా ఉన్నారు. ప్రతి వాటాదారుడికీ మేము లేఖలు రాశాము. ఆ రికార్డులు మా వద్ద ఉన్నాయి" అన్నారు. అయితే, కట్జూ వంటి కొందరు తమకు ఎటువంటి నోటీసులూ రాలేదని అంటున్నారు. శాంతి భూషణ్ వంటి వారు వాటాదారుల సంఖ్య విషయమై చట్ట పరమైన చర్యలకు దిగుతామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి వేసిన కోర్టు కేసులో ఇంప్లీడ్ కావాలని భావిస్తున్న వారి సంఖ్య పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వాటాదారుల సంఖ్యలోని మిస్టరీ ఎప్పటికి తీరేనో?!