: ఆగని 'కాల్ మనీ' ప్రకంపనలు... ఇళ్లకు బౌన్సర్లు, అత్యాచారం చేస్తామంటూ బెదరింపులు!
విజయవాడలో అధిక వడ్డీలకు అప్పులిచ్చి, వాటిని తీర్చలేకపోయిన మహిళలను వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దించాలని చూసిన కాల్ మనీ బడాబాబుల తీరు బయటపడిన తరువాత కూడా వారి అనుచరుల ఆగడాలు ఆగలేదు. తాజాగా, అప్పు తీర్చకుంటే మహిళలపై అత్యాచారం చేస్తామంటూ గత రాత్రి పలువురి ఇళ్లకు బౌన్సర్లు వెళ్లి బెదిరించినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు బౌన్సర్ల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు. కాగా, ఈ కేసులో తెలుగుదేశం ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో వారు స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలపై కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహిస్తామని బుద్దా వెంకన్న తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న శ్రీకాంత్ తనకు స్నేహితుడు మాత్రమేనని, అతనితో ఎటువంటి వ్యాపార లావాదేవీలూ లేవని వెంకన్న అన్నారు. కాల్ మనీ నిందితులతో కలసి బోడె ప్రసాద్ బ్యాంకాక్ ట్రిప్ కు వెళ్లినట్టు పోలీసులకు సాక్ష్యాలు లభించినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా నిందితుల నుంచి మూడు బస్తాల డాక్యుమెంట్లను స్వాధీనపరచుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో చెన్నుపాటి శ్రీను, ట్రాన్స్ కో డీఈ సత్యానందం కోసం పోలీసులు గాలిస్తున్నారు. సత్యానందం ఒడిశా పారిపోయినట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రజాప్రతినిధుల ప్రమేయంపై పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించగా, కేసులో మరింత లోతుగా వెళ్లవద్దని ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు రాష్ట్ర మంత్రుల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ సైతం కాల్ మనీ వ్యవహారంలో తెలుగుదేశం పాత్రపై మీడియాతో మాట్లాడతానని వెల్లడించారు.