: నాలుగు నెలల బిడ్డను తల్లి ముందే కొట్టి చంపిన మావోలు!


చత్తీస్ గఢ్ మావోయిస్టులు ఓ ఘోరానికి ఒడిగట్టారు. అభం, శుభం ఎరుగని నాలుగు నెలల చిన్నారిని కన్న తల్లి ముందే ఓ రాడ్డుతో కొట్టి చంపారు. ఈ ఘటన శనివారం నాడు బీజాపూర్ జిల్లాలోని తోడ్కా గ్రామంలో జరిగింది. బస్తర్ రేంజ్ ఐజీ ఎస్ఆర్పీ కల్లూరి తెలిపిన వివరాల ప్రకారం, తతి అయితు అనే వ్యక్తిని, అతని భార్యను, వారి నాలుగు నెలల బిడ్డను, చెల్లెలిని మావోయిస్టులు బంధించారు. పోలీసులకు సహకరిస్తున్నాడన్నది అయితుపై ఉన్న అభియోగం. అయితు మావోల కళ్లుగప్పి తప్పించుకోగా, మిగిలిన బంధీలను ప్రజా కోర్టులో నిల్చోబెట్టిన మావోలు, అతని బిడ్డను చంపాలని తీర్పిచ్చి, ఈ ఘటనకు పాల్పడ్డారు. తల్లి ముందే బిడ్డను చంపి, ఆమె చూస్తుండగానే పాతి పెట్టారు. మావోలు దులా ఓయమ్, మసా తాతి, మంగు తాతిలు ఈ ఘోరానికి ప్రధాన కారకులని, వారిపై కేసు పెట్టామని కల్లూరి తెలిపారు. ఇటీవలి కాలంలో మావోల ఏరివేతే లక్ష్యంగా పోలీసులు, భద్రతా దళాలు కీలక విజయాలు సాధిస్తుండటంతో ఈ తరహా దారుణాలకు వారు తెగబడుతున్నారని వివరించారు. కాగా, పోలీసులు 70 మందిని అక్రమంగా నిర్బంధించి హతమార్చారని ఇటీవల మావోలు ఓ ప్రకటనలో ఆరోపించారు.

  • Loading...

More Telugu News