: కేసు డిఫెన్స్ కోసం పాతిక కోట్ల ఖర్చు: సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్
'హిట్ అండ్ రన్' కేసులో సల్మాన్ తరఫున వాదనలు వినిపించేందుకు తాము 25 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసినట్టు సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ వ్యాఖ్యానించారు. "అతను సులువుగా బయటపడ్డాడు అని కొందరు అంటున్నారు. సల్మాన్ కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు. ఈ కేసుపై డిఫెన్స్ కోసం రూ. 20 నుంచి రూ. 25 కోట్లు వెచ్చించాడు. ఇంకా ఎంతో టెన్షన్ పడ్డాడు. అయితే ఎంతో మంది అండగా నిలిచారు. అన్ని ఆరోపణలనూ కొట్టి వేయడంతో ప్రస్తుతం సంతోషంగా ఉన్నాడు" అని సలీమ్ తెలిపారు. కాగా, సెప్టెంబర్ 29, 2002న సల్మాన్ ప్రయాణిస్తున్న కారు ముంబైలోని బాంద్రా సమీపంలో అదుపుతప్పగా ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కారును సల్మాన్ నడిపాడని పోలీసులు నిరూపించలేకపోయారని భావించిన బాంబే హైకోర్టు, సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించారు.