: సచిన్ కంటే గవాస్కరే గ్రేట్: పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్
సచిన్ టెండూల్కర్ కంటే సునీల్ గవాస్కరే గ్రేట్ అని పాకిస్థాన్ లో క్రికెట్ కు జీవం పోసిన దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని, రాజకీయాల్లోకి వెళ్లి విజయవంతమై, పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఢిల్లీలో ఎజెండా ఆజ్ తక్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను చూసిన భారత ఆటగాళ్లలో గవాస్కరే అత్యుత్తమమైన ఆటగాడని అన్నాడు. సచిన్ టెండూల్కర్ ప్రతిభను తక్కువ చేయలేమని చెప్పిన ఇమ్రాన్ ఖాన్, క్రికెట్ చరిత్రలో సచిన్ ది ప్రత్యేక స్థానమని చెప్పాడు. అదే సమయంలో భారత్ లో పేస్ బౌలింగ్ వనరులు లేని సమయంలో ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా గవాస్కర్ అరివీర భయంకరులని పేరున్న వెస్టిండీస్ బౌలర్లను ఎదుర్కొన్న తీరు అనితరసాధ్యమని చెప్పాడు. అలాగే పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కూడా అద్భుతమైన ఆటగాడని పేర్కొన్నాడు. ఆ రోజుల్లో ఆసీసీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్ధాయిలో ఖాదిర్ ఆడేవాడని చెప్పాడు.