: ఇన్నింగ్స్, 212 పరుగుల భారీ విజయం సాధించిన ఆసీస్
వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య హాబార్ట్ లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. పేలవమైన ఆటతీరుతో వెస్టిండీస్ ఘోరపరాజయం చవిచూసింది. 207/6 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు మరో 16 పరుగులు మాత్రమే జోడించి పెవిలియన్ చేరింది. దీంతో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ ను 148 పరుగులకే ముగించింది. ఆసీస్ బౌలర్లలో పాటిన్సన్ ఐదు వికెట్లతో రాణించగా, హాజిల్ వుడ్ మూడు, మిషెల్ మార్ష్ ఒక వికెట్ తో రాణించారు. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 583 పరుగులకు డిక్లేర్ చేసింది. షాన్ మార్ష్ సెంచరీతో మెరవగా, ఆడమ్ వోజెస్ డబుల్ సెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 223 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 148 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఇన్నింగ్స్, 212 పరుగులు తేడాతో విజయం సాధించింది. డబుల్ సెంచరీతో ఆసీస్ ను ఆధిక్యంలో నిలిపిన ఆడమ్ వోజెస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.