: 26 లక్షల మంది విద్యార్థులకు సెలవులు ఇచ్చే యోచనలో ఢిల్లీ సర్కార్
ఢిల్లీని కాలుష్య కోరల నుంచి కాపాడాలనే కృతనిశ్చయంతో కేజ్రీవాల్ సర్కార్ ఉంది. ఈ క్రమంలో సరి-బేసి వాహనాల విధానాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ విధానం అమలుకు సంబంధించి జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు ట్రయల్ రన్ చేపట్టనున్నారు. దీంతో, ఒకరోజు సరిసంఖ్య నంబర్ గల కార్లు, మరోరోజు బేసి సంఖ్య నంబర్ గల కార్లు రోడ్డు మీదకు వస్తాయి. అంటే, ప్రతి రోజు దాదాపు సగం కార్లు ఇంటికే పరిమితమవుతాయి. ఈ క్రమంలో, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలపై ఢిల్లీ సర్కారు దృష్టి సారించింది. అదనంగా 6000 ప్రైవేటు వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2000 స్కూలు బస్సులను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చించి, ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో ఉన్న 26 లక్షల మంది విద్యార్థులకు సెలవులు ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నామని చెప్పారు.