: కల్తీ పాపం మాదే... మా క్యాషియరే చేస్తున్నాడు: ఒప్పేసుకున్న మల్లాది శ్రీనివాస్
రెక్కాడితే గాని డొక్కాడని ఐదుగురు కూలీల ప్రాణాలను బలిగొన్న విజయవాడ కల్తీ మద్యం పాపం తమదేనని బుల్లయ్య అలియాస్ మల్లాది శ్రీనివాస్ ఒప్పేసుకున్నారు. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన స్వర్ణ బార్ లో ఇటీవల ఓ రోజు ఉదయాన్నే మద్యం సేవించిన దినసరి కూలీలు అక్కడికక్కడే కుప్పకూలారు. జనం స్పందించి ఆసుపత్రికి తరలించేలోగానే వారిలో ముగ్గురు చనిపోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. 29 మంది రోజుల తరబడి చికిత్స తీసుకుని బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం బార్ యజమాని, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్య మొత్తం తతంగాన్ని కక్కేశారు. కల్తీ పాపం తమదేనని, తమ వద్ద బార్ మేనేజర్ గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుతోనే ఈ దందా చేయిస్తున్నామని ఆయన ఒప్పుకున్నారట. దీంతో ఈ కేసులో చిక్కులన్నీ వీడిపోయినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఇక మల్లాది విష్ణు తల్లి బాలత్రిపుర సుందరమ్మను మరికాసేపట్లో పోలీసులు విచారించనున్నారు. బార్ భాగస్వామిగా ఉన్న ఆమె నోటి నుంచి ఎలాంటి సమాచారం బయటకు వస్తుందో చూడాలి.