: రోజు రోజుకీ ప్రయాణికులకు చేరువవుతున్న రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు
రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రోజురోజుకీ ప్రయాణికులకు మరింత దగ్గరవుతున్నారు. తన సత్వర స్పందనతో వారి మనసులు దోచుకుంటున్నారు. ప్రయాణంలో కష్టంలో ఉన్నామని ఎవరైనా ట్వీట్ చేస్తే చాలు, ఆఘమేఘాల మీద అధికారులను వారి వద్దకు పంపి, వారి సమస్యలను తీర్చేస్తున్నారు. తాజాగా మధురై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఎక్సైప్రెస్ రైలులో అవినాశ్ (5) అనే బాలుడిని తీసుకుని అతని తల్లి ఢిల్లీకి వెళ్తోంది. మంచు తీవ్రత పెరగడంతో రైలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో బాలుడు ఆకలికి తాళలేక ఏడుపులంకించుకున్నాడు. దీంతో ఆమె ఢిల్లీలో ఉన్న తన భర్తకు విషయం వెల్లడించింది. దీంతో ఆయన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సురేష్ ప్రభు అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ట్రైన్ మాల్వియా చేరే సరికి పిల్లాడికి పాలు, బిస్కెట్లు అందేలా చూశారు. దీంతో బాలుడి తల్లి వారికి కృతజ్ఞతలు తెలిపింది.