: 36 డాలర్లకు క్రూడాయిల్ ధర... మరో డాలర్ తగ్గితే ఆల్ టైం కనిష్ఠానికి... మనకి మాత్రం తగ్గించరు!


అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఏడేళ్ల కనిష్ఠ స్థాయి కన్నా కిందకు దిగజారాయి. 2008 చివర్లో క్రూడాయిల్ ధర 35 డాలర్లకు పతనం కాగా, ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. యూఎస్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర బ్యారల్ కు ప్రస్తుతం 36.52 డాలర్లకు చేరుకుంది. ఫిబ్రవరి 2009 తరువాత ఇదే అత్యంత తక్కువ కాగా, కాస్తంత నాణ్యత అధికంగా ఉండే బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారల్ కు 29 సెంట్లు తగ్గి 39.44 డాలర్లకు చేరింది. శీతాకాలం కొనసాగుతుండటం కూడా క్రూడ్ ఉత్పత్తులకు డిమాండ్ ను తగ్గించిందని, తదుపరి మూడు నెలల కాలం ఆయిల్ మార్కెట్ మరిన్ని కష్టాలను ఎదుర్కోవచ్చని జేబీసీ ఎనర్జీ ఆసియా డైరెక్టర్ రిచర్డ్ గోరే అంచనా వేశారు. అయితే, బ్యారల్ క్రూడాయిల్ ధర 20 డాలర్లకు చేరే పరిస్థితులు మాత్రం లేవని ఆయన అనడం గమనార్హం. కాగా, క్రూడాయిల్ ధరలు 35 డాలర్లకు అటూఇటుగా ఉన్న సమయంలో అంటే డిసెంబర్ 2008లో ఇండియాలో లీటరు పెట్రోలు ధర రూ. 45 వద్ద కొనసాగింది. ఇక ఇప్పుడు క్రూడాయిల్ ధరలు గణనీయంగా తగ్గి వచ్చినా భారతీయులకు చేకూరే ప్రయోజనం మాత్రం నామమాత్రమే. ప్రస్తుతం లీటరు పెట్రోలుకు రూ. 65 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్రోలు అవసరాన్ని గమనించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన పలు రకాల పన్నులే ఇందుకు కారణం. ప్రతి 15 రోజులకు ఒకసారి చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోలు ధరలను సవరిస్తున్నా, ఆ లబ్ధి ప్రజలకు మాత్రం చేరనీయకుండా ప్రభుత్వాలు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. పెట్రోలు రేట్లు పెరిగినప్పుడు ఊరకుండే ప్రభుత్వాలు, తగ్గినప్పుడు మాత్రం, వెంటనే పన్నులను పెంచి నడ్డి విరిచే పనిలో ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News