: ఒక రూపాయి సంపాదించేందుకు 97.8 పైసలు ఖర్చు చేస్తున్న భారత రైల్వే!
ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉపాధిని అందిస్తున్న సంస్థగా నిలిచిన భారతీయ రైల్వేల్లో ఖర్చులు అత్యంత ఆందోళన కలిగిస్తూ, సంస్థ మనుగడను ఇబ్బందుల్లోకి నెట్టేలా వున్నాయి. ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం రూ.1 సంపాదించేందుకు 97.8 పైసలను ఖర్చు చేస్తోంది. రైల్వేలకు సంబంధించినంత వరకూ గడచిన దశాబ్ద కాలంలో ఇదే అత్యధిక నిర్వహణా మార్జిన్ కాగా, మరే ఇతర ప్రభుత్వ సంస్థ కూడా ఆదాయ, వ్యయాల మధ్య ఇంత తక్కువ మార్జిన్ ను కలిగిలేదని తెలుస్తోంది. కాగా, ఈ రైల్వే శాఖ గణాంకాలు ఏడవ వేతన సంఘం సిఫార్సులను కలపక ముందువి కాగా, ఆ భారం కూడా పడితే మార్జిన్ మరింతగా తగ్గిపోవడం మాత్రమే కాదు, అదనపు భారాన్నీ మోపుతుంది. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారుల విశ్లేషణ ప్రకారం, వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తే రూపాయి ఆదాయం కోసం రూ. 1.10 ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. నెలకు రూ. 7,100 కోట్ల అదనపు భారాన్ని జనవరి - మార్చి 2016 మధ్య వేతనాల పెంపు రూపంలో రైల్వే శాఖ భరించాల్సి వస్తుందని, ఆపై సాలీనా రూ. 28,400 కోట్లను ఉద్యోగులకు అదనంగా చెల్లించాల్సి వుంటుందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం రైల్వే శాఖలో 13 లక్షల మంది విధులు నిర్వహిస్తుండగా, మరో 13 లక్షల మంది పదవీ విరమణ చేసి పెన్షన్ తీసుకుంటున్నారు. సంస్థ పనితీరుకు ఈ గణాంకాలు నిదర్శనమేనని అంగీకరించిన రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి, మరింత మెరుగైన ఫలితాల కోసం సరకు రవాణా, పాసింజర్ల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టిని సారించినట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 91 లేదా 92 శాతానికి ఓఆర్ (ఆపరేటింగ్ రేషియో) ఉంచాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నట్టు వివరించారు.