: 2జీ స్కాంలోకి వాజ్ పేయిని లాగుతారా?: యూపీఏపై అద్వానీ ఆగ్రహం
లక్ష కోట్ల కుంభకోణంగా వినుతికెక్కిన 2జీ వ్యవహారంలోకి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని లాగడం కాంగ్రెస్ దివాలాకోరు రాజకీయాలకు పరాకాష్ట అని బీజేపీ అగ్రనేత అద్వానీ వ్యాఖ్యానించారు. యూపీఏ సర్కారు పార్లమెంటరీ సంయుక్త సంఘం (జేపీసీ) నివేదికలో వాజ్ పేయి పేరును చేర్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని అద్వానీ ఆరోపించారు. ఇది విచారించదగ్గ విషయం అని పేర్కొన్నారు.
ప్రస్తుతం అద్వానీ కర్ణాటక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాజ్ పేయిని ఈ కుంభకోణంలో ఇరికించాలనే ఉద్ధేశంతోనే జేపీసీ చైర్మన్ పీసీ చాకో ఆయన పేరును నివేదికలో పొందుపరిచారని చెప్పారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు యూపీఏ యత్నిస్తోందని ఈ వ్యవహారంతో స్పష్టమైందని అద్వానీ అన్నారు. వాజ్ పేయి మచ్చలేని నాయకుడని, నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు అందరు ప్రధానుల్లో కెల్లా వాజ్ పేయి లాంటి స్వచ్ఛమైన వ్యక్తిని ఎన్నడూ చూడబోమని కితాబిచ్చారు. కాగా, ఈ విషయాన్ని పార్లమెంటులోనే తేల్చుకుంటామని అద్వానీ చెప్పారు.