: రాహుల్ కు చేయందించిన మోదీ... సోనియా వైపు కన్నెత్తి చూడలేదు!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ జన్మదినం సందర్భంగా నిన్న దేశ రాజధానిలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకునే రాజకీయ ప్రత్యర్థుల మధ్య కరచాలనాలు, ఆత్మీయ ఆలింగనాలకు పవార్ బర్త్ డే వేడుక వేదికైంది. మనమెప్పుడూ చూడలేమనుకున్న దృశ్యాలు కూడా ఈ వేదికపై కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన మోదీ, అక్కడి వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక తన వద్దకు వచ్చిన మోదీకి రెండు చేతులు జోడించి మరీ రాహుల్ గాంధీ నమస్కరించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రధాని మోదీ... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీలతో కలిసి కూర్చున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి నిష్క్రమిస్తున్న సందర్భంగా అందరినీ పేరు పేరునా పలుకరించిన మోదీ రాహుల్ తో ఏకంగా కరచాలనం చేశారు. అంతకుముందు తన సీటుకు రెండు సీట్ల ఆవల ఉన్న మన్మోహన్ సింగ్ ను పలకరించేందుకు అక్కడి దాకా వెళ్లిన మోదీ, ఆ పక్కనే ఉన్న సోనియా గాంధీ వైపు మాత్రం కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. మన్మోహన్ ను పలకరించేందుకు తన సమీపానికి మోదీ వచ్చిన సమయంలో సోనియా గాంధీ వేరే ఎవరితోనే ముచ్చటిస్తున్నారు. మోదీ తన సమీపానికి వచ్చిన విషయాన్నే ఆమె గమనించలేదు. అదే సమయంలో అందరినీ పలకరించిన మోదీ, సోనియాను పకలరించకపోవడంపై అక్కడున్న వారిలో ఆసక్తికర చర్చ సాగింది.