: దాయాదుల పోరు జరగకుంటే... పీసీబీకి రూ.325 కోట్ల నష్టం!
దాయాదుల పోరుగా ప్రసిద్ధిగాంచిన భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ షహర్యార్ ఖాన్ పలుమార్లు భారత్ లో పర్యటించారు. గతంలో చాలాసార్లు బీసీసీఐతో చర్చలు జరిపిన ఆయన, ఇటీవల ఏకంగా ముంబైలోని బీసీసీఐ కార్యాలయానికి వచ్చారు. ఎలాగైనా ఈ సిరీస్ ను నిర్వహించి తీరాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. కొన్నిసార్లు అసహనానికి గురై సిరీస్ జరగకపోయినా ఇబ్బందేమీ లేదని ప్రకటించిన షహర్యార్ నిన్న ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. దాయాదుల పోరు జరగకుంటే తమ బోర్డుకు రూ.325 కోట్ల (50 మిలియన్ డాలర్లు) మేర నష్టం వాటిల్లనుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు షహర్యార్ ఖాన్ పేర్కొన్నట్లుగా పాకిస్థాన్ పత్రిక ‘డాన్’ నిన్న ఓ కథనాన్ని రాసింది.