: ఈసారి ఏమైందో?... సగం ఇటేస్తే, సగం అటేశారు: కుప్పం ఓటర్లపై చంద్రబాబు కామెంట్


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న తన సొంత నియోజకవర్గానికి చెందిన ఓటర్లపై ఆసక్తికర కామెంట్ చేశారు. కుప్పంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా పంటల సంజీవిని చైతన్య రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన ఎన్నికల్లో తనకు తగ్గిన మెజారిటీపై ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను ప్రచారానికి రాకపోయినా, 70 నుంచి 80 వేల మెజారిటీతో కుప్పం ఓటర్లు గెలిపించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే ఈ దఫా ఏమైందో కాని... సగం మంది ఇటు ఓటు వేస్తే మరో సగం మంది అటువైపు వేశారని అన్నారు. అయినా బాధపడటం లేదని కూడా చంద్రబాబు చెప్పారు. అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తానని ప్రకటించారు. కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి తిరుగులేని నమూనాగా తయారు చేయడం కోసమే ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News