: జియా ఖాన్ ది ఆత్మహత్యే...కానీ సూరజ్ ఆమెను హింసించాడు: చార్జ్ షీట్ లో సీబీఐ!


బాలీవుడ్ నటి జియాఖాన్ ది ఆత్మహత్యేనని సీబీఐ నిర్ధారించింది. జియా ఖాన్ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేసిన సీబీఐ న్యాయస్థానానికి నివేదిక అందజేసింది. 2013 జూన్ 3న ఆత్మహత్య చేసుకున్న జియాఖాన్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు రాత్రి సూరజ్ పంచోలీకి ఫోన్ చేసి 400 నిమిషాల పాటు మాట్లాడిందని దర్యాప్తు నివేదికలో పొందుపరిచారు. ఆమె ఆత్మహత్యకు ముందు నాలుగు వారాల గర్భాన్ని తీయించుకుందని (అబార్షన్) వారు వెల్లడించారు. సంతకం పెట్టకుండా ఆమె రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్ ఆమె మానసిక స్థితిని తెలియజేస్తోందని సీబీఐ అభిప్రాయపడింది. సూరజ్ పంచోలీపై ఐపీసీ సెక్షన్ 306పై కేసులు నమోదు చేశారని, ఆమెది హత్య కాదని, సూరజ్ ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటుందని సీబీఐ పేర్కొంది. ఆత్మహత్యకు మూడు రోజుల ముందు వరకు ఆమె సూరజ్ పంచోలీ ఇంట్లోనే ఉన్నట్టు సీబీఐ వెల్లడించింది. అయితే వారిద్దిరికీ తెలిసిన మరో యువతిని సూరజ్ కలవడం వల్ల వీరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. ఆమె పదేపదే మెసేంజర్ నుంచి మెసేజ్ లు పెడుతుండడంతో సూరజ్ పంచోలీ బ్లాక్ బెర్రీ మెసేంజర్ నుంచి ఆమె నెంబర్ ను డిలీట్ చేసేశాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆ తరువాతే సూరజ్ తో ఆమె 400 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడిందని, అనంతరం ఆత్మహత్యకు పాల్పడిందని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి అందజేసిన చార్జ్ షీట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News