: వరద బాధిత ఉద్యోగుల కోసం రూ. 1,100 కోట్లు పక్కనబెట్టిన టీసీఎస్
చెన్నైలో ఇటీవలి భారీ వరదల కారణంగా తమ సంస్థలోని ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడటం ఐటీ దిగ్గజం టీసీఎస్ యాజమాన్యాన్ని కదిలించి వేసింది. ఉద్యోగుల్లో పలువురి ఇళ్లలోని సామాన్లు పాడైపోవడం, వాహనాలు వంటి ఆస్తులు ధ్వంసం కావడంతో, వారిని ఆదుకునేందుకు రూ. 1,100 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగులకు వడ్డీ రహిత క్యాష్ అడ్వాన్సుల రూపంలో ఈ మొత్తాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎవరికి కావాలన్నా తీసుకోవచ్చని వెల్లడించింది. ఒక్కో ఉద్యోగి కనీసం రూ. లక్ష నుంచి గరిష్ఠంగా మూడు నెలల స్థూల వేతనం వరకూ అడ్వాన్స్ పొందవచ్చని సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తమ ఉద్యోగులు నష్టపోవడం కదిలించి వేసిందని ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వారు కోలుకోవాలన్నదే తమ అభిమతమని, చెన్నైలోని టీసీఎసర్లను ఆదుకునేందుకు ఎంతైనా కేటాయించేందుకు సిద్ధమని తెలిపారు. గడచిన 100 సంవత్సరాల్లో ఇంతటి వరద రాలేదని గుర్తు చేసుకున్న ఆయన, కష్టకాలంలో ప్రతి ఉద్యోగికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఇళ్లలో పూర్తి నష్టం జరిగిన వారికి అదనంగా నెల వేతనం ఇవ్వదలిచామని, ఆసుపత్రుల్లో చికిత్సలు పొందిన వారి ఖర్చంతా భరిస్తామని తెలిపారు. మెడికల్ ఇన్స్యూరెన్స్ క్లయిములను దాటిన మొత్తాలను సంస్థ చెల్లిస్తుందని పేర్కొన్నారు. వేలాది మంది వాహనాలు పాడైపోయినందున డిసెంబర్ 31 వరకూ ప్రతి ఒక్క ఉద్యోగినీ ఉచితంగా ఆఫీసులకు తీసుకువచ్చి తిరిగి ఇళ్ల వద్ద దింపే ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాగా, చెన్నై చుట్టుపక్కల టీసీఎస్ 13 సెంటర్లను నిర్వహిస్తుండగా, వీటిల్లో 60 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.