: సిడ్నీ పోలీసుల తనిఖీల్లో విధ్వంసం కుట్ర బయటపడింది!
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న ఆసీస్ పోలీసులు సిడ్నీలో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ విచారణలో బయటపడిన వాస్తవాన్ని చూసి వారు షాక్ తిన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ ప్రభుత్వ భవనాన్ని పేల్చేయడానికి వీరు కుట్ర పన్నినట్టు తేలింది. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, ఈ విధ్వంసానికి పాల్పడేందుకు మరో ఇద్దరు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే 15 ఏళ్ల యువకుడు, 20 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరూ గతేడాది ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్యచేసిన కేసులో నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని జైలుకి తరలించారు. ఉగ్రవాద కుట్రలను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని అధికారులు వెల్లడించారు.