: ఏపీలో తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుకు కేంద్రం అనుమతి: మంత్రి ప్రత్తిపాటి
రాష్ట్రంలో తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాణ్యతలో 10 శాతం తేడా ఉన్న ధాన్యం కొనుగోలుకు ఉత్తర్వులు ఇచ్చామని, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే 4.75 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. ఈ నెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని గుంటూరులో చెప్పారు. నీటి విషయంలో పంటలను కాపాడుకునేందుకు పొలాల్లోనే నీటి కుంటలు తవ్వాలని రైతులకు సూచించారు. 'పనికి ఆహారం' పథకం నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల నీటి కుంటలు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రత్తిపాటి తెలిపారు. ఇందుకోసం ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. కొన్ని రకాల బయో ఉత్పత్తులు రైతులను మోసగిస్తున్నాయన్న మంత్రి, అందుకే బయో కంపెనీలపై చర్యలకు ప్రైవేటు న్యాయవాదిని కూడా నియమించామని చెప్పారు. గిరిజనుల అనుమతితోనే బాక్సైట్ తవ్వకాలపై ముందుకెళతామని, జగన్ ఆందోళనలు, ధర్నాలు మోసపూరితమని వ్యాఖ్యానించారు.