: 2015 ఫేస్ బుక్ హీరోలు వీరే!


సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ లో 2015లో అత్యధికంగా ట్రెండ్ అయిన, చర్చ జరిగిన పదాలు, వ్యక్తుల జాబితా వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగింది? ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి నెటిజన్లు ఫేస్ బుక్ పై అత్యధికంగా ఆధారపడుతున్న వేళ, భారత కస్టమర్లు ఎక్కువగా ఏం మాట్లాడుకున్నారో ఫేస్ బుక్ తెలియజేసింది. ఈ జాబితాను పరిశీలిస్తే, మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ఇక రెండవ స్థానంలో ఈ-కామర్స్ సంస్థల గురించి, ఆపై అబ్దుల్ కలాం, జక్కన్న చెక్కిన 'బాహుబలి', నేపాల్ భూకంపం తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. వీటితో పాటు వరుసగా, సల్మాన్ ఖాన్ కేసు, క్రికెట్ వరల్డ్ కప్, బీహార్ ఎన్నికలు, దీపికా పదుకొనే, భారత సైన్యం గురించిన చర్చ నెటిజన్లలో అత్యధికంగా జరిగింది. ఇక ఎక్కువగా వెతికిన ప్రాంతాల విషయానికి వస్తే ఇండియా గేట్ (1), తాజ్ మహల్ (2), ముంబై మెరైన్ డ్రైవ్ (3), నంది కొండలు (4), గేట్ వే ఆఫ్ ఇండియా (5), హరిద్వార్ లోని హర్ కీ పౌరీ (6), కుతుబ్ మినార్ (7), ముస్సోరీ (8), రామోజీ ఫిలింసిటీ (9), అమృతసర్ దేవాలయం (10) నిలిచాయని ఫేస్ బుక్ చెప్పింది. నెటిజన్ల మధ్య హాట్ హాట్ చర్చ జరిగిన విషయాల్లో, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పారిస్ పై ఉగ్రదాడి, సిరియా నుంచి వలసలు టాప్-3లో నిలువగా, నేపాల్ భూకంపం, గ్రీకులో ఆర్థిక సంక్షోభం, ఐఎస్ఐఎస్ పై పోరాటం, ఉగ్రదాడులు తదితరాలపై నెటిజన్లు అధికంగా చర్చించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖంగా వినిపించిన వ్యక్తుల పేర్లలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముందు నిలువగా, తదుపరి అధ్యక్ష పదవికి పోటీ పడతాడని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచాడు. ఆపై దిల్మా రోసెఫ్, హిలరీ క్లింటన్, బెర్నాయ్ సేండర్స్, లూజ్ ఇనాసియో, రిసెవ్ తయివ్ ఎర్డోజన్, మహ్మద్ బుహారీ, నరేంద్ర మోదీ, బెంజిమెన్ నెతన్యాహూలు టాప్-10లో నిలిచారు.

  • Loading...

More Telugu News