: వాతావరణ మార్పులపై పుస్తకం రాసిన మోదీ ...పారిస్ లో ఆవిష్కరణ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా ఓ కొత్త పుస్తకం రాశారు. దాని పేరు 'కన్వీనియెంట్ యాక్షన్-కంటిన్యూటీ ఫర్ ఛేంజ్'. పారిస్ లో వాతావరణ మార్పుల సదస్సు కాప్-21 సందర్భంగా ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండ్, పలువురు ప్రపంచాధినేతలు పాల్గొన్నారు. ఈ పుస్తకం గురించి ప్రధాని ఈ రోజు ఉదయం ట్విట్టర్ లో తెలిపారు. వాతావరణ మార్పుల సమస్య తీవ్రతను తగ్గించేందుకు భారత్ చేస్తున్న కృషి, వాతావరణ న్యాయం ఆవశ్యకతను వివరిస్తూ తాను పుస్తకం రాసినట్టు తెలిపారు. తక్కువ కార్బన్ విడుదల చేసే ఆర్థిక వ్యవస్థగా భారత్ ను మార్చేందుకు జరుగుతున్న కృషిని అందులో వివరించారు. ఈ పుస్తకాన్ని లెక్సిస్ నెక్సిస్ సంస్థ ప్రచురించగా... అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా, జపాన్ వంటి దేశాల ప్రధాన నగరాల్లో పుస్తకం విడుదలైంది. గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో 'కన్వీనియెంట్ యాక్షన్: గుజరాత్ రెస్పాన్స్ టు చాలెంజ్స్ ఆఫ్ క్లైమెట్ ఛేంజ్' అనే పుస్తకాన్ని మోదీ రాశారు.