: 'అడగండి చెబుతా' అంటున్న గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్
మరో వారంలో భారత్ ను సందర్శించనున్న గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో 'ఆస్క్ సుందర్' పేరిట ప్రత్యేకంగా విద్యార్థులతో సమావేశమై వారి సందేహాలను తీర్చనున్నారు. 17వ తేదీని ఆయన ఢిల్లీకి రానుండగా, తన పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన టెక్కీలతో ఢిల్లీ యూనివర్శిటీలో సమావేశమవుతారని, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలిసి ఇండియాలో ఇంటర్నెట్ విస్తరణపై చర్చిస్తారని తెలుస్తోంది. కాగా, సుందర్ పర్యటన అనంతరం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైతం ఇండియాకు రానున్న సంగతి తెలిసిందే. సత్య తన పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో ఔత్సాహికులతో సమావేశం కానున్నారు.