: ఒకప్పుడు స్టోర్ క్లర్క్, ఆపై గూగుల్ 20వ ఉద్యోగిని, ఇప్పుడు 'యాహూ'కి సీఈఓ!


ఆమె పేరు మరిస్సా మేయర్. వయసు 40. ప్రస్తుత ఉద్యోగం యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంతేకాదు, ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న వారిలో ఆమె ఒకరు. గత సంవత్సరం ఆమె వేతనం 42 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 250 కోట్లు). ప్రపంచంలోని అత్యంత పవర్ ఫుల్ మహిళల్లో ఆమె 22వ స్థానంలో ఉన్నారు. ఈ స్థాయికి రావడం, ఇంత హోదా గుర్తింపు ఆమెకు ఒక్కసారిగా వచ్చినవి కావు. ఓ 22 సంవత్సరాల వెనక్కు వెళితే... విస్కాన్సిన్ అనే చిన్న నగరంలో జన్మించిన ఆమె, 1995 ప్రాంతంలో ఆమె ఓ గ్రాసరీ స్టోర్ లో క్లర్క్ గా పనిచేస్తూ, కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించింది. ఆ సమయంలోనే ఇంటర్నెట్ శరవేగంగా విస్తరిస్తోంది. లారీ పేజ్, సెర్గి బ్రిన్ అనే ఇద్దరు వ్యక్తులు కొత్తగా గూగుల్ పేరిట ఓ సంస్థను ప్రారంభించి ఉద్యోగుల కోసం వెతుకుతున్నారని తెలిసి వెళ్లింది. 1999లో గూగుల్ లో 20వ ఉద్యోగినిగా మరిస్సా చేరింది. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. గూగుల్ లో అంచెలంచెలుగా ఎదిగింది. ఆమె నేతృత్వంలోని టీమే గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ స్ట్రీట్ వ్యూ, డెస్క్ టాప్, మొబైల్ ఫోన్ల కోసం లోకల్ సెర్చ్ తదితరాలను మనకందించాయి. మరో ఇంటర్నెట్ దిగ్గజం యాహూ, పోటీ ప్రపంచంలో పడుతూ లేస్తున్న వేళ, సంస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే ఎవరుండాలని యాజమాన్యం ఆలోచిస్తే, వారికి మరిస్సా కనిపించింది. ఓ భారీ ఆఫర్ తో యాహూ బోర్డు డైరెక్టర్లు ఆమెను 2012లో సంస్థలోకి ఆహ్వానించారు. అత్యున్నత సీఈఓ పదవిని కట్టబెట్టారు. ఆమె చేరిన తరువాత యాహూ కొంత నిలబడింది కూడా. యువతకు దగ్గరైన బ్లాగింగ్ ఫ్లాట్ ఫాం 'టుంబ్లర్' యాహూలో విలీనం వెనుక మరిస్సా తెలివితేటలున్నాయి. ఫోర్బ్స్, టైమ్, ఫోర్చ్యూన్, వానిటీ ఫెయిర్, వోగ్ వంటి ఎన్నో పత్రికలు ఆమె ముఖ చిత్రాలను ప్రచురించాయి. 2009లో 'ఉమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డునూ ఆమె గెలుచుకున్నారు. ఫైనాన్షియర్ జాజరీ బోగ్ ను వివాహమాడిన ఆమె, 2012లో తొలిసారి గర్భవతిగా ఉన్నప్పుడు 16 వారాల మెటర్నిటీ సెలవు పెట్టి, ఆపై రెండు వారాలకే విధుల్లోకి వచ్చేసి, తన నిబద్ధతను చాటి అందరి ప్రశంసలనూ అందుకున్నారు. ఇక ఇప్పుడు తాను మరోమారు తల్లిని కానున్నానని, ఈ దఫా కవలలకు జన్మనిస్తున్నానని వెల్లడించిన మరిస్సా, సాధ్యమైనంత తక్కువ టైం మాత్రమే సెలవుగా తీసుకుంటానని వెల్లడించారు. పిల్లలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, పనిచేసే సంస్థ ఉన్నతిపైనా సమాన దృష్టిని పెట్టాలన్నది ఆమె సలహా.

  • Loading...

More Telugu News