: ఐఆర్సీటీసీ యాప్ లో మరిన్ని పేమెంట్ ఆప్షన్లు!
స్మార్ట్ ఫోన్ల ద్వారా తమకు కావాల్సిన బుకింగ్స్ చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో ఇండియాలో రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ సేవలందిస్తున్న ఐఆర్సీటీసీ, చెల్లింపుల విధానాన్ని మరింత సరళతరం చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తాము అందిస్తున్న యాప్ లో గుర్ గాం కేంద్రంగా పనిచేస్తున్న పేమెంట్ సంస్థ 'మోబీక్విక్'ను జోడించింది. మోబీక్విక్ ను వినియోగిస్తున్న నెటిజన్ల సంఖ్య 2.5 కోట్ల వరకూ ఉండగా, వీరంతా ఒక్క క్లిక్ తో తమ మొబైల్ వాలెట్ నుంచి రైల్వే టికెట్ల రుసుము చెల్లించి, మరింత వేగంగా బుకింగ్ చేసుకోగలుగుతారు. కాగా, ప్రస్తుతం రోజుకు ఐఆర్సీటీసీ మొబైల్ యాప్ ద్వారా 25 వేల నుంచి 30 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇవన్నీ వీసా, మ్యాస్ట్రో తదితర చెల్లింపు మాధ్యమాల ద్వారా బుక్ అవుతున్నాయి. డిజిటల్ మనీ విధానం విస్తరిస్తున్న వేళ, ఐఆర్సీటీసీతో తమ భాగస్వామ్యం రెండు సంస్థలకూ లబ్ధిని చేకూరుస్తుందని మోబీక్విక్ వ్యవస్థాపక సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. చెల్లింపుల ప్రాసెసింగ్ లో తాము 100 శాతం సక్సెస్ రేటును సాధించామని తెలిపారు. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకం ద్వారా ఐఆర్సీటీసీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 20,620 కోట్లకు చేరుకుంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రెట్టింపు.