: తమిళనాట కొత్త భయం... 'యముడు దున్నపోతుపై వచ్చి ప్రాణాలు తీసేస్తాడట'!
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడు ప్రజలకు కొత్త కొత్త భయాలు పుట్టుకు వస్తున్నాయి. యముడు దున్నపోతుపై వచ్చి ఇంటి యజమాని ప్రాణాలను లాక్కెళ్తాడన్న ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. సామాజిక మాధ్యమాల పుణ్యమాని ఈ ప్రచారం అందరినీ భయపెడుతోంది. ఇక మహిళలు తమ పసుపు కుంకాలు కాపాడుకునేందుకు ప్రత్యేక పూజలు చేయాల్సి వుంటుందని చెబుతూ, అవి ఎలా ఉండాలో సూచిస్తున్న సమాచారమూ చక్కర్లు కొడుతోంది. వీటిని చూసిన మహిళలు అలాగే చేస్తూ, తెల్లవారుఝామునే నిద్ర లేచి, ఇంటి బయట ముగ్గులతో అలంకరించి, ప్రత్యేక దీపాలు పెడుతూ, ఆపై ఆంజనేయుని ఆలయాలకు భర్తలను తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక ఇప్పటివరకూ యముడు మాత్రం ఎక్కడ కనబడలేదుగానీ, హడావుడి మాత్రం బాగానే ఉంది. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మి భయపడవద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.